జిల్లా కలెక్టరుగా సురేష్ కుమార్ గారు అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఎంతో కాలం గా జిల్లా వాసులు ఎదురుచూస్తున్న కొత్త కలెక్టరేటును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు చొరవ చూపారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం 'పరిష్కారం' సెల్ ను ప్రారంభించారు. బాల కార్మిక సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించారు. ఉద్యోగ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. రైతులకు 640 కోట్లరూపాయల మేర రుణాలను రుణ మేళాల్లో అందజేశారు.
మెదక్ జిల్లా కలెక్టరు సురేష్ కుమార్ గారు 1972 మే 25 న జన్మించారు. ఫారెస్ట్రీ లో డిగ్రీ చేశారు. సిల్వి కల్చర్ లోఎమ్మెస్సీ చేశారు. ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో 2000 సంవత్సరం లో ఐ.ఎ.ఎస్. సాధించారు. 2002 నుండి 2003 వరకు తూర్పు గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టరుగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన అనంతరం అదే జిల్లాలో 2004 జనవరి నుండి 2004 జూన్ వరకు సబ్ కలెక్టరు గా పని చేశారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో ప్రాజెక్ట్ అధికారిగా ఏడాదిన్నర పాటు పని చేశారు. అనంతరం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టరు గా 2008 మార్చి వరకు పనిచేసిన ఆయన జిల్లాకు వచ్చేవరకు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టరు గా విధులు నిర్వర్తించారు. గత ఏడాదిగా మెదక్ జిల్లా కలెక్టరు గా విధులు నిర్వహిస్తున్న ఆయన అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకున్నారు.